Media News
జగన్ డిసైడ్ అయ్యారా?

జగన్ డిసైడ్ అయ్యారా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ రాజకీయాల్లో తన వైఖరిని మార్చుకుంటున్నారా? ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టానికి గతంలో మద్దతు ఇవ్వడంపై ఇప్పుడు విచారం వ్యక్తం చేయడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఈ చర్చకు కారణమయ్యాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టానికి తమ పార్టీ మద్దతు ఇవ్వడం తప్పేనని జగన్ తాజాగా అంగీకరించారు. ప్రధానమంత్రి, ఆయన ఎంపిక చేసిన కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.
నియామక ప్రక్రియలో మార్పులు చేయాలని కోరారు. గతంలో పార్లమెంటులో ఎన్డీయే ప్రభుత్వానికి పలు అంశాల్లో వైసీపీ మద్దతు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణలపై ప్రతిపక్షాల ఆందోళనలకు జగన్ మద్దతు తెలుపుతున్నారు. ఈ పరిణామాలతో జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన కేసుల విషయంలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుండటం వంటి పరిణామాలు కూడా జగన్ ప్రత్యామ్నాయ మార్గం వైపు వెళ్లేలా చేస్తున్నాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తాజా వైఖరి ఇండియా కూటమిలో చేరే నిర్ణయానికి సంకేతమా, లేక నిర్దిష్ట అంశాలకే పరిమితమైన రాజకీయ వైఖరా అన్నది వైసీపీ తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
Posted by Beyond I Media· Admin
Views · 10








