Media News

జువెనైల్‌ జస్టిస్ చట్టానికి పదేళ్లు

జువెనైల్‌ జస్టిస్ చట్టానికి పదేళ్లు

జువెనైల్‌ జస్టిస్ చట్టానికి పదేళ్లు

భారతదేశంలో పిల్లల సంరక్షణ, రక్షణ, పునరావాసం, సమాజంలో తిరిగి కలిసిపోయేందుకు అవసరమైన సహాయాన్ని అందించడంలో జువెనైల్‌ జస్టిస్‌ (బాలల సంరక్షణ, రక్షణ) చట్టం–2015 కీలకమైనది. ఈ చట్టం 2016 జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. 2026 నాటికి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమీక్షించుకోవడంతోపాటు, రాబోయే దశాబ్దానికి స్పష్టమైన కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. బాలల రక్షణ కోసం చట్టాలున్నాయి. బాలల సంక్షేమ కమిటీలు, బాల న్యాయ మండళ్లు, జిల్లా బాలల రక్షణ విభాగాలు, ప్రత్యేక బాలల పోలీసు విభాగాలు, బాలల సంరక్షణ గృహాలు వంటి వ్యవస్థలూ ఉన్నాయి. దత్తత, కుటుంబ ఆధారిత సంరక్షణ, ఆర్థిక సహాయం, సంరక్షణ గృహాల నుంచి బయటకు వచ్చిన యువతకు తోడ్పాటు వంటి కార్యక్రమాలూ అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ ప్రమాదంలో ఉన్న ప్రతి బిడ్డను సకాలంలో గుర్తించి, రక్షించి, పునరావాసం కల్పించగలుగుతున్నామా? అన్నది కీలక ప్రశ్న. రాబోయే దశాబ్దంలో ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం నుంచి ముందుగానే గుర్తించి నివారించడం వైపు దృష్టి మళ్లాలి.

ముందస్తు నివారణే మేలు బాల్య వివాహాలు, బాల కార్మికత్వం, అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, పాఠశాల మానేయడం, మత్తు పదార్థాల వినియోగం, అంతర్జాల దోపిడీ వంటి సమస్యలకు ముందే హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. పాఠశాలకు హాజరు తగ్గినప్పుడే కారణాలు తెలుసుకోవాలి. బాల్య వివాహం జరగకముందే కుటుంబానికి సహాయం అందించాలి. ప్రతి జిల్లాలో ప్రమాదంలో ఉన్న పిల్లలను గుర్తించి ముందస్తు సహాయం అందించే నమోదు వ్యవస్థ ఉండాలి. అది పిల్లలకు ముద్ర వేసేందుకు కాకుండా వారి రక్షణకు ఉపయోగపడాలి.

తెలంగాణకు ప్రత్యేక కార్యాచరణ తెలంగాణలో బాలల రక్షణ వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు జిల్లాలవారీగా సమస్యలను విశ్లేషించాలి. ప్రాంతాలవారీగా బాల్య వివాహాలు, వలస కుటుంబాల పిల్లలు, బాల కార్మికత్వం, మత్తు పదార్థాల వంటి సమస్యలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు, బాలల సంక్షేమ కమిటీలు, జిల్లా బాలల రక్షణ విభాగాలు, విద్య, వైద్యం, కార్మిక, పంచాయతీరాజ్‌ శాఖలు, న్యాయ సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. బాల్య వివాహాల సమాచారం పెళ్లికి కొన్ని గంటల ముందు అందే పరిస్థితి మారాలి. బాలల సంక్షేమ కమిటీలు, బాల్య వివాహాల నిషేధ అధికారులు, పోలీసులు, జిల్లా యంత్రాంగం ముందుగానే స్పందించేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసర రక్షణ, తాత్కాలిక సంరక్షణ, తదుపరి పర్యవేక్షణకు అవసరమైన చట్టపరమైన, పరిపాలనా మద్దతు కల్పించాలి. పెళ్లి తర్వాత కేసు నమోదు చేయడం కంటే.. పెళ్లి జరగకుండా బాలికను కాపాడటమే గొప్ప విజయం.

గ్రామం నుంచి పాఠశాల వరకు రక్షణ ప్రతి గ్రామ పంచాయతీలో బాలల రక్షణ కమిటీ చురుకుగా పనిచేస్తూ బాల్య వివాహాలు, బడి మానేసిన పిల్లలు, బాల కార్మికులు, అదృశ్యమైన పిల్లలు, హింస, అక్రమ రవాణా ముప్పులను గుర్తించాలి. ప్రతి గ్రామాన్ని బాల్య వివాహాలు, బాల కార్మికత్వం, పాఠశాల మానేసే పిల్లలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలి. పాఠశాలల్లో పిల్లల భద్రతకు బాధ్యత వహించే ఉపాధ్యాయుడిని నియమించి, సమస్యలు గుర్తించినప్పుడు ఎవరిని సంప్రదించాలో స్పష్టమైన విధానం ఉండాలి. పిల్లల గైర్హాజరు కేవలం హాజరు సమస్య కాదు.. కొన్ని సందర్భాల్లో అది ప్రమాదానికి హెచ్చరిక. మత్తు పదార్థాల వినియోగాన్ని కూడా ఆరోగ్య, రక్షణ సమస్యగా పరిగణించి ముందస్తు గుర్తింపు, కౌన్సెలింగ్‌, వైద్య సేవలు, కుటుంబ సహకారం, పునరావాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే పోలీసు స్టేషన్‌, ఆసుపత్రి, బాలల సంక్షేమ కమిటీ లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించే పిల్లలకు చట్టపరమైన సహాయంతోపాటు మానవీయమైన అండ అవసరం. శిక్షణ పొందిన సహాయకులు వైద్యం, వాంగ్మూలం, న్యాయ సహాయం, పరిహారం, కుటుంబ సమన్వయం, పునరావాసంలో తోడ్పడాలి. ప్రతి జిల్లాలో అర్హతలు ధ్రువీకరించిన సహాయకుల జాబితా ఉండాలి. బాలల మనస్తత్వం, మానసిక గాయాలు, వైకల్యాలున్న పిల్లల అవసరాలపై వారికి శిక్షణ ఇవ్వాలి. ఇంటర్నెట్‌లో పిల్లలను వలలో వేసుకోవడం, బెదిరింపులు, లైంగిక దోపిడీ చిత్రాలు, కృత్రిమ మేధతో సృష్టించిన అశ్లీల చిత్రాలు, అంతర్జాల అక్రమ రవాణా వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. పిల్లలను సాంకేతికతకు దూరం చేయడం కాకుండా సురక్షిత వినియోగంపై అవగాహన కల్పించాలి. పోలీసులు, సైబర్‌ నేర విభాగాలు, పాఠశాలలు కలిసి ఫిర్యాదు నుంచి రక్షణ, అభ్యంతరకర సమాచార తొలగింపు, పునరావాసం వరకు పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించాలి. భారతీయ అధికారులకు సమాచారం సకాలంలో చేరేలా అంతర్జాల వేదికలతో సమన్వయం అవసరం. ఈ విషయంలో 2024 సుప్రీంకోర్టు తీర్పు కూడా ప్రస్తావనీయమైనది.

పునరావాసమే అసలైన విజయం ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది పిల్లలను రక్షించామనే గణాంకాలకే పరిమితం కాకూడదు. ఎంతమంది తిరిగి పాఠశాలకు వెళ్లారు? ఎంతమందికి గుర్తింపు పత్రాలు, పరిహారం అందాయి? ఎంతమంది సురక్షిత కుటుంబాల్లో పునరావాసం పొందారు? ఎంతమంది తిరిగి దోపిడీకి గురికాలేదు? అన్నది పరిశీలించాలి. పిల్లవాడిని ఇంటికి పంపడమే పునరావాసం కాదు. ఆ ఇల్లు సురక్షితమా, చదువు కొనసాగుతుందా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా అని పరిశీలించాలి. సురక్షితమైన కుటుంబ వాతావరణం ఉన్నప్పుడు కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. పేదరికం కారణంగా పిల్లలు కుటుంబాల నుంచి విడిపోకుండా ఆర్థిక, విద్యా సహాయం అందించాలి. సంరక్షణ గృహాల్లో భద్రతా తనిఖీలు, సిబ్బంది నేపథ్య పరిశీలన, వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్‌, విద్య, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉండాలి. వైకల్యాలున్న పిల్లలు, అనాథలు, వీధుల్లో జీవించే పిల్లలకు ప్రత్యేక సహాయం అందించాలి. 18 ఏళ్లు నిండిన తర్వాత సంరక్షణ గృహాల నుంచి బయటకు వచ్చే యువతకు ఉన్నత విద్య, వృత్తి శిక్షణ, ఉపాధి, నివాసం, స్వతంత్ర జీవనానికి తోడ్పాటు కల్పించాలి. బాలల రక్షణలో పనిచేసే సిబ్బందికి నిరంతర శిక్షణ కూడా అవసరం.

తెలంగాణకు ‘బాలల రక్షణ–2036’ తెలంగాణ ప్రభుత్వం ‘బాలల రక్షణ–2036’ పేరుతో దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. ఇందులో పది ప్రాధాన్యతలు ఉండాలి: ముందస్తు నివారణ; బాలల సంక్షేమ కమిటీల బలోపేతం; ప్రతి బాధిత బాలుడికి సహాయకుడు; అంతర్జాల భద్రత; ఫలితాల ఆధారిత కేసుల నిర్వహణ; కుటుంబ ఆధారిత సంరక్షణ; సిబ్బందికి నిరంతర శిక్షణ; శాఖల మధ్య సమన్వయం; ప్రతి పిల్లవాడికి గుర్తింపు, గౌరవం; నిర్ణయాల్లో పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యత. జువెనైల్‌ జస్టిస్‌ చట్టం రెండో దశాబ్దం మరింత సమర్థమైన, పిల్లల కేంద్రంగా పనిచేసే వ్యవస్థను కోరుతోంది. చట్టం నుంచి సమర్థమైన అమలుకు, రక్షణ చర్యల నుంచి ముందస్తు నివారణకు, కేసుల పరిష్కారం నుంచి పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అడుగులు వేయాలి. ప్రతి బిడ్డ సురక్షితం కావాలి.. ప్రతి బిడ్డ పాఠశాలకు వెళ్లాలి.. ప్రతి బిడ్డకు సురక్షితమైన సంరక్షణ, గౌరవం, ఉజ్వల భవిష్యత్తు లభించాలి. బాలల రక్షణ విజయాన్ని కేసుల సంఖ్యతో కాదు.. వారి జీవితం ఎంత సురక్షితంగా, గౌరవప్రదంగా మారిందో దానితో కొలవాలి. బాలల రక్షణ అంటే వారిని ప్రమాదం నుంచి బయటకు తీయడం మాత్రమే కాదు.. సురక్షితమైన, గౌరవప్రదమైన, స్వతంత్ర భవిష్యత్తు వైపు నడిపించడం.

— చందన మరిపల్లి సభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

Posted by Beyond I Media· Admin

Views · 68

Trending News

rains-farmersNewsWatch

rains-farmers

వర్షాల వల్ల సాగుకు ఊతం లభించింది.

222Aug 5, 2026