Politics
కొత్త రాజకీయ కార్యాచరణపై రాజగోపాల్‌రెడ్డి సంకేతాలు

కొత్త రాజకీయ కార్యాచరణపై రాజగోపాల్‌రెడ్డి సంకేతాలు
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త రాజకీయ కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ విధానాలపై రాజగోపాల్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. వైఎస్సార్ ఆలోచనా విధానం, ప్రజా సంక్షేమ పంథా తనకు ఆదర్శమని పేర్కొన్నారు. తమ కుటుంబానికి వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై కూడా రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు సాగాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలను వ్యాపారంగా భావించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసేవారికి ప్రజల్లో ఆదరణ ఎక్కువకాలం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా బలమైన రాజకీయ వేదిక అవసరమని పేర్కొన్నారు. అయితే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి స్పష్టంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటించనున్న రాజకీయ కార్యాచరణపై ఆయన వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Posted by Srikanth Bethi · Super Admin
Views · 30








